సీరత్‌ కపూర్‌కి బంపరాఫర్.. సమంతను రీప్లేస్ చేసేసింది

ఏ మాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ డ్యాన్స్, డైలాగులకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే కాకుండా అల్లు అర్జున్ సింపుల్ గా వేసిన డ్యాన్స్ స్టెప్పులకు ప్రముఖులు సైతం మైమరిచిపోయారు. ఈ సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ స్పెషల్ సాంగ్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఈ సాంగ్ పేరుతో ఆమెను పిలిచేవారు. అంతలా ఈ సాంగ్ ఆమెకు ప్రత్యేక పేరు తీసుకొచ్చింది. సినిమా దర్శకుడు సుకుమార్ ఇలాంటి స్పెషల్ సాంగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారనే విషయంపై ప్రస్తుతం పలు ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ అవకాశాన్ని హీరోయిన్ సీరత్ కపూర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయాలని మరోసారి సమంతను చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ ఆఫర్‌ను సమంత సున్నితంగా తిరస్కరించిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే తరుణంలో సమంత స్థానంలో స్పెషల్ సాంగ్‌కు సీరత్ కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ తో ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. దీంతో ఆమె స్పెషల్ సాంగ్ చేయడం ఖాయమైందనే వాదనకు ఈ ఫొటోలు బలపర్చాయి.

ఇదే నిజమైతే సీరత్ కపూర్ కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ వాదనను కొట్టిపారేసింది. అటువంటి వార్తలు నిరాధారం అని ఇటీవల పేర్కొంది. సినీ బృందం అధికారికంగా ప్రకటించకుండానే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు చెక్ పెట్టేందుకే ఆమె ఇలా చెప్పిందని అంతా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్ దశ తిరుగుతుందని అభిమానులు పేర్కొంటున్నారు.

Share post:

Latest