బ్రహ్మానందం గొప్ప మ‌న‌సు.. ఆ జబర్దస్త్ కమెడియన్‌కు ఇల్లు కొనిచ్చిన కామెడీ కింగ్‌!

కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వివిధ భాషలలో 1250కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేశారు. గతంలో ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం.. ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో క‌నిపించ‌డం కూడా గ‌గ‌నమైంది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే బ్రహ్మానందం గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. తన తోటి కళాకారులకు, కమెడియన్లకు ఎప్పుడు ఆయ‌న అండంగా నిలుస్తారు. తాజాగా ఆయ‌న మంచి మ‌న‌సు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. బ్రహ్మానందం ఒక జబర్దస్త్‌ కమెడియన్‌కు స్వయంగా ఇల్లు కొనిచ్చారట. ఇంత‌కీ ఆ కమెడియన్‌ మరెవరో కాదు.. రచ్చ రవి.

ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌చ్చ ర‌వి ఈ విష‌యాన్ని స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టాడు. `బ్రహ్మానందం గారు నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకునేవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావం ఆయ‌న‌ది. నా సినిమా కెరీర్ ప్రారంభం లో ఆయన నన్ను ఇల్లు కట్టుకోరా అని చాలా సార్లు చెప్పేవారు. ఒక‌రోజు రూ.5 లక్షలు చేతిలో పెట్టి.. స్వయంగా ఆయనే ఫ్లాట్‌ చూపించి ఇది కొనుక్కోరా బాగా కలిసివస్తుంది అని చెప్పారు. అయన చెప్పిన ఫ్లాట్ లోకి వెళ్లాక‌ నాకు అంతా కలిసి వచ్చింది. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. నటుడిగా మంచి పేరు సంపాదించాను. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాను. బ్రహ్మానందం గారి వ‌ల్లే ఇదంతా జ‌రిగింది` అంటూ ర‌చ్చ ర‌వి చెప్పుకొచ్చాడు. దీంతో బ్ర‌హ్మానందం గొప్ప మ‌న‌సుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Share post:

Latest