ప్రముఖ నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు
తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన గణేష్, రవితేజ హీరోగా నటించిన ‘ఆంజనేయులు’ సినిమాకి నిర్మాతగా మారి కొత్త కెరీర్ మొదలుపెట్టాడు. నిర్మాతగా కూడా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
చివరిగా బండ్ల గణేష్ ‘టెంపర్’ అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఇక బండ్ల గణేష్ కొంతకాలం క్రితం ‘డేగల బాబ్జి’ సినిమాలో ప్రధాన పాత్రలో మెరిసాడు. బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఏ ఫంక్షన్ కి వెళ్లినా పవన్ గురించి మాట్లాడుతూ దేవర అని పవన్ కళ్యాణ్ ని సంభోదిస్తుంటాడు.
ఆ దేవర అనే టైటిల్‌తో పవన్ కళ్యాణ్‌ని హీరోగా పెట్టి సినిమా తియ్యబోతున్నట్లు కూడా ప్రకటించాడు బండ్ల గణేష్. ఇంతవరకు బానే ఉంది కానీ ‘దేవరా’ అనే టైటిల్‌ని ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయడం మాత్రం మర్చిపోయాడు బండ్ల గణేష్. దాంతో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాకి దేవర అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. బండ్ల గణేష్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఎన్టీఆర్ కు మంచి ప్రయోజనం కలిగిందని చెప్పాలి. ఈ విధంగా బండ్లగణేష్ కారణంగా ఎన్టీఆర్ కు,కొరటాల శివకు మంచి జరిగింది.