పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘బ్రో’. పి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగతి విదితమే. మెగా మేనమామ – మేనల్లుడు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన సాయి తేజ్ ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.
ఈ క్రమంలో ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలకు సంబంధించి పలు అనుమానాలు ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయి. ఈ సినిమాలో దేవుడి పాత్ర అనేది చాలా కీలకం. అయితే ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారనేది ప్రశ్న. ఐతే ‘బ్రో’ సినిమాలో పవన్ ఒక దేవుడిగా కనిపించనున్నారని అర్ధం అవుతోంది. ఎందుకంటే పవన్ మోషన్ పోస్టర్లో “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే..” అనే శ్లోకం మనకు వినబడింది కాబట్టి దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారని కూడా తాజాగా ప్రకటించారు.
మోషన్ పోస్టర్లో గోడ గడియారాన్ని చూపిస్తూ ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో తేజ్ ఒక భక్తుడిగా కనిపిస్తాడని అనుకుంటుండగా, తెల్లని దుస్తుల్లో ఒక దేవదూతగా ప్రెజెంట్ చేయడం కొసమెరుపు. పురాణాల ప్రకారం, మార్కండేయుడు శివుని యొక్క గొప్ప భక్తుడు. ఇప్పుడు ‘బ్రో’ లో సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు మార్కండేయులు అని పెట్టడాన్ని బట్టి, సినిమాలో అతను మృత్యువుని జయించి, తన కోరికలను నెరవేర్చుకుంటాడనిపిస్తోంది. ఇకపోతే ‘బ్రో’ అనేది ‘వినోదయ సీతం’ అనే తమిళ్ చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే.