`ఆదిపురుష్` ట్రైలర్ వ‌చ్చేసింది.. హైలెట్స్ ఇవే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు. జూన్‌ 16న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పాటు దాదాపు 70 దేశాల్లోని అనేక థియేటర్లలోనూ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది.

టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్‌ ట్రైలర్‌తో ఆకట్టుకుంటారా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. `ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం..` అంటూ హనుమంతుడు డైలాగ్స్ ప్రారంభ‌మైన ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

సీతారాములుగా ప్రభాస్ కృతి సనన్‌ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్ ను మాత్రమే సినిమాలో చూపించ‌బోతున్నార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థ‌మైంది. `సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం` అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని సూచిస్తుంది. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు. విజువ‌ల్స్‌, డైలాగ్స్‌, ఎమోష‌న్స్ ట్రైల‌ర్ లో హైలెట్స్ గా నిలిచాయి. మొత్తానికి ఆదిపురుష్ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజర్ కంటే వంద రెట్లు మెరుగ్గా ట్రైలర్ ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest