వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకుండా, తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించాలని పవన్…వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. చివరిగా రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని, ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయబోమని, పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ధ మద్దతును అందిస్తోందని చెప్పుకొచ్చారు.

ఇలా పవన్..వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వడంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. ఒకవైపు టి‌డి‌పి..వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తుంది. ఇక విశాఖ టి‌డి‌పి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అసలు రాష్ట్రానికి రాజధానే లేనప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా వస్తుందని,  రాష్ట్రం నుంచి ‘లులు’ ‘అమర్ రాజా’ వంటి సంస్థలను వెళ్లగొట్టామని చెప్తారా? అని ప్రశ్నించారు.

ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారని,  పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి చేయడం వెనుక కారణాలేంటో ప్రజలకు వివరించాలని గంటా కోరారు. మొత్తానికి టి‌డి‌పి ఏమో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే జనసేన మద్ధతు ఇచ్చింది.