సొంత ఎమ్మెల్యేలపై డౌట్..దెబ్బవేసేది ఎవరు?  

ఎలాగో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే చేతిలో బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఉన్న బలం ప్రకారం గెలవడం సులువు కాదు. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో స్థానం గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 స్థానాలకు 154 ఎమ్మెల్యేలు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 151..అయితే టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి 1 ఎమ్మెల్యే వైసీపీలోకి వచ్చారు.

దీంతో 7 స్థానాలు వైసీపీ ఈజీగా గెలుచుకోవచ్చు. కానీ ఇదే సమయంలో టి‌డి‌పి పోటీ పెట్టింది. పంచుమర్తి అనురాధని బరిలో దింపారు. అంటే 6 స్థానాల్లో వైసీపీ గెలుపు సులువే. 7వ స్థానంలో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టి‌డి‌పి విప్ ఇచ్చింది..టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సైతం విప్ వర్తిస్తుంది. విప్ వ్యతిరేకిస్తే వేటు పడే ఛాన్స్ ఉంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది చూడాలి. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వేటు పడకుండా తప్పించుకునే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో వైసీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యేలు తయారయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వీరు వైసీపీకి దూరమయ్యారు. టి‌డి‌పికి ఓటు వేసే ఛాన్స్ ఉంది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అయితే ఈ ఇద్దరు టి‌డి‌పి వైపుకు వెళితే..టి‌డి‌పి బలం 21 అవుతుంది. ఇంకో ఎమ్మెల్యే ఉంటే టి‌డి‌పి గెలిచేస్తుంది.

ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఆనం, కోటంరెడ్డి కాకుండా నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారని తెలిసింది. ఇక వారిపై పోలీసులతోపాటు పార్టీ శ్రేణులతోనూ నిఘా పెట్టినట్లు సమాచారం. చూడాలి మరి ఎవరు వైసీపీకి షాక్ ఇస్తారో.