టీడీపీలో యువతకు భారీగా సీట్లు..బాబు అదిరే స్కెచ్!

రాజకీయాల్లో ఎప్పుడు యువత చాలా కీలకమనే చెప్పాలి. రాజకీయ పార్టీల భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుంది..యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువగా యువ ఓటర్లని ఆకర్షించడం కుదురుతుంది. అయితే ఏపీ రాజకీయాల్లో మెజారిటీ యువత వైసీపీ, జనసేన వైపు ఉన్నారు. టీడీపీ వైపు యువత తక్కువగానే ఉన్నారు. గత ఎన్నికల్లోనే అది అర్ధమైంది. అందుకే అధినేత చంద్రబాబు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు.

అటు నారా లోకేష్ సైతం యువ నేతలకు ప్రాధాన్యత పెరిగేలా చేస్తున్నారు. ఓ వైపు యువత ఓట్లని టార్గెట్ చేసుకుని లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు పార్టీలో యువ నేతలకు ప్రాధాన్యత పెంచుతున్నారు. ఇప్పటికే 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఆయన ముందుకెళుతున్నారు. కొన్ని స్థానాల్లో సీనియర్లని పక్కన పెట్టి యువ నేతలకు సీట్లు ఇస్తూ వస్తున్నారు.

ఇటీవల కాలంలో పలు సీట్ల బాధ్యతలని యువ నేతలకు అప్పగించారు. కోవూరులో దినేష్ రెడ్డి, గోపాలాపురం మద్దిరాజు వెంకట్రాజులని ఇంచార్జ్‌లుగా పెట్టారు. తాజాగా నాలుగు సీట్లలో కూడా యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. తుని సీటు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఫిక్స్ చేశారు. అటు పి. గన్నవరం సీటు బాలయోగి వారసుడు హరీష్‌కు ఇచ్చారు.

ఇటు సత్యవేడు సీటు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌కు కేటాయించారు. అటు నెల్లిమర్ల సీటు బంగార్రాజుకు ఫిక్స్ చేశారు. ఇంకా పలు సీట్లలో యువ నేతలు బరిలో దిగనున్నారు. ఇలా ఎక్కడకక్కడ యువ నేతలకు ప్రాధాన్యత పెంచుతూ..యువత ఓట్లని ఆకర్షించేలా బాబు ప్లాన్ చేశారు.