టీడీపీ మాజీ మంత్రిని వెంటాడుతోన్న వైసీపీ.. ఇంత టార్గెట్ ఎందుకు..!

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌పై అదే క‌సి.. అదే రాజ‌కీయం.. !! ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం నారాయ‌ణ‌పై అదే దూకుడుగా ముందుకు సాగుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూముల విష యంపై ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన సీఐడీ పోలీసులు.. ఆయ‌న‌ను విచారించారు. అయితే.. ఇటీవ‌ల దీనిపై స్పందించిన హైకోర్టు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. విచారించాల‌ని అంత‌కుమించి దూకుడుగా ముందుకు వెళ్లొద్ద‌ని కూడా సూచించింది.

అయితే..ఎంతైనా వైసీపీ ప్ర‌భుత్వం క‌దా.. కోర్టు చెప్పిన‌ట్టు చేస్తే.. ఎలా అనుకుందో ఏమో.. నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు.. ఆయ‌న ఇంటిపై కూడా సీఐడీ.. అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో సీఐడీ సోదాలు వ‌రుస‌గా రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. శుక్ర‌వారం నారాయణ కుమార్తె నివాసంలో దాడులు నిర్వహించిన అధికారులు శ‌నివారం మాత్రం నేరుగా నారాయ‌ణ ఇంట్లోనే సోదాలు చేశారు.

రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు ప్రకటించడం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాల్లోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కుటుంబీకుల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే పలు లావాదేవీ ల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం.

సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టడంతో నారాయ‌ణ ఒకింత ఆవేద‌నకు గురైన‌ట్టు స‌మాచారం. త‌న పేరు ప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బ‌తీసి.. స‌మాజంలో త‌న వ్యాపారాన్ని దెబ్బ‌తీయాల‌నే ఉద్దేశంతోనే వైసీపీ ప్ర‌భుత్వం ఇలా చేస్తోంద‌ని నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ దెబ్బ‌తో భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లో కొన‌సాగాలంటే నారాయ‌ణ అయిష్టంతో ఉన్నార‌ట‌.

Share post:

Latest