తారక్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్.. ఎందుకంటే

టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ అనగానే మల్టీ టాలెంటెడ్ అని చెప్పేస్తారు. ప్రస్తుత తరంలో ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే, మరో వైపు హీరోలుగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. దీనిని మాత్రం విశ్వక్ సేన్ చేసి చూపించాడు. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్‌తో జరిగిన గొడవలో ఆయనపై నెటిజన్లు సానుభూతి కురిపించారు. ఇక ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి వైదొలిగాడు. ఇది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చ అయింది. ఏదేమైనా తనదైన యాటిట్యూడ్‌తో తన పంథాలో విశ్వక్ సేన్ ముందుకు సాగుతున్నాడు. ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని విశ్వక్ సేన్ చెబుతుంటాడు. ప్రస్తుతం తారక్ కోసం విశ్వక్ సేన్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమాల వైపు దృష్టిసారిస్తున్నారు. చిన్న హీరోలు కూడా తమ సినిమాలను వివిధ భాషలలోకి విడుదల చేస్తున్నారు. ఇటువంటి వారందరికీ నిఖిల్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడి కార్తికేయ-2 సినిమా ఊహించని హిట్ అందుకుంది. దీంతో విశ్వక్ సేన్ కూడా ధమ్కీ సినిమాను దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

మార్చి 22కి ఉగాది రోజున ఈ పాన్ ఇండియా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాల చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 18న నిర్వహించాలని విశ్వక్ సేన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ను పిలవాలని భావిస్తున్నాడు. తారక్‌కు తాను పెద్ద అభిమాని అని పలు సందర్భాల్లో విశ్వక్ సేన్ చెప్పాడు. అయితే ఎన్టీఆర్ ఆ రోజు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆస్కార్ అవార్డుల కోసం తారక్ ఆ సమయంలో విదేశాలకు వెళ్లాల్సి ఉంది. దీంతో తారక్ వస్తాడా రాడా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే విశ్వక్ సేన్ మాత్రం తారక్ వస్తాడనే కోటి ఆశలతో చూస్తున్నాడు.