గత కొద్ది రోజుల నుంచి నందమూరి బాలకృష్ణ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్న బాలయ్య.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో `దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి. వారి నాయకుడు రావణాసురుడు` అని కామెంట్ చేసి దేవాంగ కులస్తులకు ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా నర్సు గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` సీజన్ లో 2 ఇటీవల పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే షో లో భాగంగా.. బాలయ్య తాను కాలేజీ రోజుల్లో ఉండగా జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించారు. తాను ప్రమాదంతో పడిపోగా.. తనను ఆస్పత్రికి తరలించారని.. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రిలో నర్సు కనిపించిందని వివరించారు. `ఆ నర్సు దాని.. యమా అందంగా ఉంది` అంటూ బాలయ్య ఆ టైమ్ లో టక్కున నోరు జారారు. ఈ కామెంట్ పైనే నర్సుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నర్సులను కించపరిచేలా బాలయ్య వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
తాజాగా ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. `అందరికి నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.
రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ` అంటూ బాలయ్య తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ పెట్టారు.