నెల్లిమర్ల టీడీపీలో సెగలు..పతివాడ షాక్?

నెల్లిమర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిని తప్పించి…బంగార్రాజుని ఇంచార్జ్‌గా పెట్టడంపై పతివాడ వర్గం భగ్గుమంటుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పతివాడ పనిచేస్తున్నారు. ఆరుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో నెల్లిమర్ల బరిలో నిలబడి ఓడిపోయారు. ఓడిపోయాక కాస్త యాక్టివ్ గా ఉండటం లేదు. వయసు పై బడటంతో పతివాడ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

కానీ టి‌డి‌పి అధిష్టానం మాత్రం ఆయన్నే ఇంచార్జ్ గా కొనసాగిస్తూ వచ్చింది. ఇదే క్రమంలో నెల్లిమర్ల ఇంచార్జ్ పదవికి పలువురు నేతలు పోటీ పడ్డారు. ఇదే క్రమంలో బంగార్రాజుతో పాటు పతివాడ మనవడు సైతం పోటీ పడ్డారు. బంగార్రాజు దూకుడుగా పనిచేయడం, క్యాడర్‌ని కలుపుకుని వెళ్ళడం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు అంతర్గత సర్వేల్లో తేలింది. దీంతో చంద్రబాబు మరో ఆలోచన లేకుండా నెల్లిమర్లకు ఇంచార్జ్ గా బంగార్రాజుని నియమించారు.

అయితే సీనియర్ గా ఉన్న తనని ఏ మాత్రం సంప్రదించకుండా,తనని తొలిగిస్తున్నట్లు చెప్పకుండా కొత్త ఇంచార్జ్‌ని నియమించడంపై పతివాడ కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. కానీ వివాదాలకు దూరంగా ఉండే పతివాడ చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించారు. కాకపోతే ఆయన అనుచరులు మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో పతివాడకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక బంగార్రాజుకు పతివాడ వర్గం ఏ మాత్రం సహకరిస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. నియోజకవర్గంపై పట్టున్న పతివాడ సహకరిస్తేనే బంగార్రాజుకు ప్లస్ అవుతుంది. లేదంటే నెల్లిమర్లలో టి‌డి‌పి గెలుపు అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా నేతలంతా కలిసి పనిచేస్తేనే నెల్లిమర్లలో టి‌డి‌పి సత్తా చాటుతుంది.