దొంగ ఓట్లకు అడ్డా..పెద్దిరెడ్డిదే ఆ ఘనత!

ఇటీవల ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. అధికార వైసీపీ బై ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో దొంగ ఓట్లు వేయించి గెలిచిందని టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో, అలాగే కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని, పక్కనే ఉన్న తమిళనాడు నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం అలా దొంగ ఓట్లతో గెలిపించుకోవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం..టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతోనే గెలిచారని ఫైర్ అవుతున్నారు. ఇక వారి ఆరోపణలకు టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కౌంటర్లు ఇచ్చారు. దొంగ ఓట్ల గురించే మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, అసలు దొంగ ఓట్లకు నాంది పలికింది వైసీపీ నేతలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు భయపడి ఏకగ్రీవం చేసుకునే వైసీపీ కూడా ఓట్లు, ఓటర్లు గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.

అటు టీడీపీ నేత దొరబాబు మాట్లాడుతూ..చిత్తూరు ఎంపీ ఉండగా రాజంపేట ఎంపీకి కుప్పంలో ఏం పనని ప్రశ్నించారు. కుప్పం వచ్చి పోటీ చేస్తానంటున్నా పెద్దిరెడ్డికి..పుంగనూరులో పోటీ చేయడానికి భయమేసిందా? అని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఇలా రెండు పార్టీల మధ్య దొంగ ఓట్ల కలకలం రేగింది.