కాపు ఉద్యమం..పవన్‌కు ప్లస్..జగన్‌కు రివర్స్..!

టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్‌కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.  కానీ అక్కడ బ్రేక్ పడింది.

ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు 5 శాతం కాపులకు కేటాయించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒకే కులానికి 5 శాతం ఇవ్వడం కుదరదని టోటల్ గా ఆ రిజర్వేషన్లని అమలు నిలిపేశారు. కానీ ఇటీవల కేంద్రం..ఈ రిజర్వేషన్లు ఎలా అమలు చేసుకోవాలనేది రాష్ట్రాల ఇష్టమని క్లారిటీ ఇచ్చింది. దీంతో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయించాలని డిమాండ్ పెరిగింది. ఇదే క్రమంలో కాపు సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య నిరవధిక దీక్షకు దిగారు.

చేగొండి దీక్ష విరమణ

అయితే ఈ వయసులో దీక్ష సరికాదని పవన్ చెప్పడంతో..జోగయ్య తాజాగా దీక్ష విరమించారు. కానీ 5  శాతం కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడుతూనే ఉంటామని జోగయ్య స్పష్టం చేశారు. ఈ కాపుల రిజర్వేషన్లపై వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లని సైతం అమలు చేయడంలో విఫలమవుతుందని విమర్శలు వస్తున్నాయి.

కాపులు ఎక్కువ కాబట్టి 10 శాతంలో 5 శాతం ఇవ్వాలని డిమాండ్ సహేతుకమే అని చర్చ నడుస్తోంది. కానీ దీనిపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునేలా లేదు. దీని వల్ల కాపుల నుంచి జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పవన్‌కు ఈ కాపు అంశం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.