ఆ రెండు సంఘటనలు బాలయ్య పై నెగిటివిటీ పెరిగిందా..ఆయన మనసులో ఏముంది..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తన తండ్రికి తగ్గ నటుడుగా తన సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన మాటలతో తన చెష్టల‌తో ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నారు. కొన్ని సందర్భాల్లో బాలయ్య చేసిన కామెంట్లు కాస్త వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలకి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అఖండ- వీర సింహారెడ్డి సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో త‌న మార్కెట్‌ను పెంచుకున్నాడు.

మరో పక్క బుల్లితెరపై అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేసి నేటితరం యువతలోను కూడా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. త్వరలోనే బాలయ్య హ్యాట్రిక్ విజయం కూడా అందుకుంటారని అభిమానులు భావిస్తున్న క్రమంలో ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతున్నారు బాలయ్య. ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సక్సెస్ తో బాలయ్య సూపర్ ఫామ్ లోకి వచ్చాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని నటీనటులకు బాలయ్య ఓ ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు. అక్కడ బాలయ్య సినిమాలో నటించిన హనీ రోజ్ తో మద్యం తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. ఆ కామెంట్లు అభిమానులు మర్చిపోకముందే.. ఈ చిత్ర యూనిట్ ఎంతో గ్రాండ్ గా హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఆ కార్యక్రమంలో బాలకృష్ణ ఈ సినిమా నిర్మాతల గురించి మాట్లాడుతూ ఓ సందర్భంలో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో దుమారం లేపాయి.

బాలయ్య చేసిన ఈ కామెంట్లతో సగటు సిని అభిమానుల మనసులు సైతం గాయపరిచాయి. ఇప్పుడు వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు ఘటనల వల్ల బాలకృష్ణ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. ఇక అయితే బాలకృష్ణ ఈ విషయంపై ఇప్పటికి తన వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే నిన‌ అక్కినేని హీరోలు బాలకృష్ణ వ్యాఖ్యలపై ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ వివాదాన్ని పెద్దది చేయాలని అక్కినేని హీరోలు సైతం అనుకోవడం లేదు. బాలకృష్ణ ఈ వివాదంపై ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ వివాదం గురించి ఆయన నోరు విప్పే అవకాశం కూడా ఉంది.

ఈ వివాదం వల్ల బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కు అక్కినేని హీరోలు వచ్చే అవకాశం అయితే లేదనే కామెంట్లు కూడా రావడం గమనార్హం. బాలకృష్ణ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఆయన కావాలనే ఈ వ్యాఖ్యలు చేయలేదని సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు చెబుతున్నారు. బాలకృష్ణ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇస్తే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ట్రోల్స్ బాలయ్య కెరీర్ పై ఏం మాత్రం ప్రభావం చూపవని మరి కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి