కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని రీసెంట్ టైమ్స్ లో బాగా తెలుస్తోంది. ముఖ్యంగా కొద్ది వారాల క్రితం విడుదలైన “కాంతారా” విజయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగులో సినిమా విజయం అనేది దాని కంటెంట్‌పైనే ఆధారపడి ఉంటుందని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా తాజాగా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. అందుకే మలయాళంలో ఘనవిజయం సాధించిన “మాలికాపురం” చిత్రాన్ని ఇటీవలే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశాడు.
ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం శబరిమల ఆలయాన్ని సందర్శించాలనే ఒక వ్యక్తి కోరిక చుట్టూ తిరుగుతుంటుంది. ఈ సినిమా కేరళలో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఇది సూపర్ హిట్ అయ్యుండేది. కానీ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయలేదు. ప్రమోషన్ లేకపోవడం వల్ల ఈ సినిమా కేరళలో బ్లాక్ బస్టర్ అయినదని, ఇందులో మంచి కంటెంట్ ఉందని కూడా ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి ఇది రిలీజ్ అయినట్లు కూడా ఎవరికీ తెలియడం లేదు.
ఇటీవల విడుదలైన సుధీర్ బాబు సినిమా ‘హంట్’ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పుడు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాలేవీ కూడా లేవు. ఇంత మంచి సమయంలో మాలికాపురం బాగా ప్రమోట్ చేసి ఉంటే, దానికి చాలా స్పందన వచ్చేది. దీన్ని బట్టి అల్లు అరవింద్ సినిమాను ప్రమోట్ చేయడంలో విఫలమవడం వల్ల బాక్సాఫీస్ వద్ద సినిమాకి పెద్ద మైనస్ అయిందని తెలిసిపోతుంది. సాధారణంగా అల్లు అర్జున్ తన సినిమాలను బాగా ప్రమోట్ చేసి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు కానీ ఈ మూవీ విషయంలో అతడు వ్యవహరించిన తీరు చాలామందిని షాక్‌కి గురి చేస్తోంది.