రాష్ట్రంలో టీడీపీని దెబ్బతీసే క్రమంలో చాలావరకు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నాయకులని వైసీపీలోకి లాగేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా టీడీపీ నేతలని లాగడం వల్ల వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉంది. వారు తీసిన గోతిలో వారే పడుతున్నారు. అలా టీడీపీ నేతలు వచ్చిన చోట ఆధిపత్య పోరు పెరిగి వైసీపీకి మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అదే పరిస్తితి కనిపిస్తోంది.
అక్కడ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని దెబ్బకొట్టాలని చెప్పి..వైసీపీ తెలివిగా అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడుని వైసీపీలోకి తీసుకొచ్చారు. దీని ద్వారా టీడీపీలోనే కాదు..అయ్యన్న ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టారు. అలా అయ్యన్న సోదరుడుని వైసీపీలోకి తీసుకొచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే శంకర్ గణేశ్, సన్యాసి పాత్రుడు కలిసి అయ్యన్నని దెబ్బతీసే విధంగా రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ వారు చేసిన రాజకీయం వారికే రివర్స్ అయ్యే పరిస్తితి. అనూహ్యంగా అయ్యన్న బలం పెరిగింది.
ఇదే క్రమంలో నర్సీపట్నం వైసీపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఈ మధ్య ఎమ్మెల్యే గణేశ్, సన్యాసిపాత్రుడు..సెపరేట్ గా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలని సన్యాసి పాత్రుడు సెపరేట్‌గా , ఎమ్మెల్యే గణేశ్ సెపరేట్‌గా నిర్వహించారు. జగన్ జన్మదిన వేడుకలని పోటాపోటిగా నిర్వహించారు. దీంతో నర్సీపట్నం వైసీపీలో గ్రూపు వార్ పెరిగిందని అర్ధమవుతుంది.
అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం సన్యాసి పాత్రుడు, గణేశ్‌ల మధ్య పోటీ ఉందని తెలుస్తోంది. ఇటు ఎలాగో గణేశ్ పనితీరు సరిగ్గా లేదని సర్వేలు ఇస్తున్నాయి. పనితీరు బాగోకపోతే సీటు ఇవ్వనని జగన్ అంటున్నారు. అందుకే ఆ సీటు కోసం సన్యాసిపాత్రుడు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. దీనివల్ల వైసీపీకే నష్టం.