కరోనా అనంతరం భారతీయ సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వివిధ ప్రరిశ్రమలు తమ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించడానికే భయపడిన పరిస్థితిని నెలకొంది. అయితే ఎవరు ఊహించని స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం సినిమాలను రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా 2022లో ఇక్కడ అత్యధిక సినిమాలు విడుదలయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల చాలా సినిమాల షూటింగ్ లు ఆలస్యం కావడంతో 2020, 2021 సంవత్సరాలలో రిలీజ్ కావాల్సిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో సందడి చేసాయి.
ఇకపోతే ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఎక్కువశాతం డబ్బింగ్ సినిమాలు అయినటువంటి మన తెలుగు సినిమాలు కావడం విశేషం. ఈ ఏడాది ఏకంగా 297 సినిమాలు విడుదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒక విధంగా ఇది ఇండియాలోనే రికార్డ్ అని సినిమా పండితులు చెబుతున్నారు. ఈ విడుదలైన సినిమాలలో ఎన్నో సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ కీర్తిప్రతిష్టలను పెంచాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
RRR, కార్తికేయ2, సీతారామం, మేజర్ వంటి సినిమాలు తెలుగు నుండి రిలీజై పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా జెండాను రెపరెపలాడిస్తే…. కన్నడ నుండి KGF2, కాంతార, సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తమ ఉనికిని చాటుకున్నాయి. ఆయా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించడం గమనార్హం. రాజమౌళి వల్ల ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగింది. డబ్ చేసి సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిణామం తెలుగు పరిశ్రమకు ఎంతో వైభవాన్ని తెచ్చిపెడుతోంది.