టీడీపీలో ముస్లిం అభ్యర్ధులు..కడప టార్గెట్..!

రాష్ట్రంలో సామాజికవర్గాల పరంగా ఓట్లు కొల్లగొట్టాలని ప్రధాన పార్టీల ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నికల దగ్గరపడుతున్నప్పుడల్లా కులాల పరంగా రాజకీయం చేసి..కొన్ని కులాల ఓట్లని దక్కించుకోవాలని చూస్తారు. అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని..ఇలా కులాల పరంగా రాజకీయం చేస్తూ ఉంటాయి. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయం నడుపుతాయి. ఆ కులానికి తగ్గ సమీకరణాలతో ముందుకెళ్తారు.

అయితే ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చాలా కీలకం అని చెప్పవచ్చు. వారే గెలుపోటములని ప్రభావితం చేస్తారు. ఇక మొదట నుంచి ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. కాంగ్రెస్ దెబ్బతినడంతో వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది. విజయవాడ వెస్ట్, కర్నూలు సిటీ, గుంటూరు ఈస్ట్, మదనపల్లె, కడప సిటీ..ఈ సీట్లు అన్నీ వైసీపీనే గెలుచుకుంది. ఒక్క విజయవాడ వెస్ట్ మినహా మిగిలిన సీట్లలో ముస్లిం అభ్యర్ధులే గెలిచారు.

గుంటూరు ఈస్ట్ లో ముస్తఫా, మదనపల్లెలో నవాజ్ బాషా, కర్నూలులో అబ్దుల్ హాజీజ్, కడపలో అంజాద్ బాషా గెలిచారు. ఇందులో అంజాద్ మంత్రిగా ఉన్నారు. ఇలా ముస్లిం ఫార్ములాతో ఈ స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ సైతం అదే ఫార్ములాని ఫాలో అవ్వాలని చూస్తుంది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లా కడపపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో కడప అసెంబ్లీలో అటు వైసీపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి ముస్లిం అభ్యర్ధులు పోటీ చేశారు.

వైసీపీ నుంచి అంజాద్, టీడీపీ నుంచి అమీర్ పోటీ చేశారు. గెలుపు అంజాద్‌ని వరించింది..మరోసారి కూడా ఇక్కడ ముస్లిం అభ్యర్ధినే బరిలో దించాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో కడప ఎంపీగా కూడా ముస్లిం అభ్యర్ధిని బరిలో పెట్టి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తుంది. కానీ వైసీపీ కంచుకోటగా ఉన్న కడపని టీడీపీ దక్కించుకోవడం అంత సులువు కాదు.