గుడివాడలో కీ టర్నింగ్..టీడీపీలో ట్విస్ట్‌లు.!

రాష్ట్ర రాజకీయాలని ఆకర్షించే గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం రోజుకో రకంగా మారుతుంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీలో పరిస్తితులు అర్ధం కాకుండా ఉన్నాయి. గుడివాడలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది. కానీ ఎక్కడా కూడా కొడాలికి చెక్ పెట్టలేకపోతుంది. అభ్యర్ధులని మార్చిన ఫలితం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అభ్యర్ధిని మారుస్తారనే ప్రచారం వస్తుంది. దీంతో టీడీపీ సీటు విషయంపై క్లారిటీ లేదు.

కానీ గుడివాడ టీడీపీ సీటు తనదే అని, తానే పోటీ చేస్తానని ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు అంటున్నారు. ఈయన మొదట్లో సరిగ్గా పనిచేయలేదు గాని..ఈ మధ్య కాలంలో దూకుడుగా పనిచేస్తున్నారు సరే అంతా బాగానే ఉంది..ఇంకా రావికి సీటు ఇచ్చేస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదే తరుణంలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము గుడివాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్ధికంగా బలంగా ఉన్న ఈయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీటు ఆశిస్తున్నారని తెలిసింది.

కానీ ఇప్పుడు మాత్రం పార్టీలో చేరలేదు. పార్టీ పరంగా పని చేయడం లేదు. రాము ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక రాము కమ్మ వర్గానికి చెందిన వారు..అటు ఆయన భార్య ఎస్సీ..దీంతో గుడివాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ..ఎస్సీలకు సాయం అందిస్తున్నారు. అయితే గుడివాడలో ఎస్సీలే కొడాలికి బలం. ఆ బలాన్ని ఇప్పుడు రాము తనవైపుకు తిప్పుకుంటున్నారు.

దీంతో గుడివాడ టీడీపీ సీటు రాముకు దక్కుతుందా? అనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో రావి, రాము కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు సీటు ఎవరికి ఇస్తారని చెప్పి టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. మొత్తానికి గుడివాడ టీడీపీలో ట్విస్ట్‌లు మామూలుగా లేవు.