బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!

ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలవడానికి మంచి ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక్కడ టీడీపీ పలు రకాలుగా అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి 2014లో వైసీపీ నుంచి గెలిచిన సుజయ కృష్ణరంగారావుని టీడీపీలోకి తీసుకున్నారు..మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో సుజయ టీడీపీ నుంచి పోటీ చేశారు. కానీ గెలుపు దక్కలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..గతంలో టీడీపీ నుంచి గెలిచిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు..2019లో వైసీపీ నుంచి గెలిచారు.

అయితే ఎమ్మెల్యేగా శంబంగి పనితీరు అంత ఆశాజనకంగా లేదు. ఆయనపై వ్యతిరేకత ఎక్కువగానే వచ్చింది. సొంత పార్టీ నేతలే ఆయన్ని వ్యతిరేకించే పరిస్తితి కనిపిస్తోంది. అటు బొబ్బిలి ప్రజలు సైతం ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్నారు. అభివృద్ధి లేదు…అక్రమాలు, అవినీతి పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాలు శంబంగికి ఇబ్బందిగా మారాయి.

అటు టీడీపీ నుంచి సుజయ సోదరుడు బేబీ నాయన ఇంచార్జ్‌గా ఉంటూ బొబ్బిలిలో పార్టీ బలాన్ని పెంచారు. ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలపై పోరాడుతున్నారు. ఇక తాజాగా బొబ్బిలిలో బాబు టూర్ సాగింది. ఈ టూర్‌లో ప్రజలు భారీ స్థాయిలో కనిపించారు. బొబ్బిలి సెంటర్‌లో జనసందోహం కనిపించింది. దీని బట్టి చూస్తే 30 ఏళ్ల తర్వాత బొబ్బిలిలో టీడీపీ గెలుపుకు మంచి అవకాశం దొరికినట్లే కనిపిస్తోంది.