రేవంత్ పాదయాత్ర..సీనియర్లు బ్రేక్ వేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. బలంగా ఉన్న పార్టీ కాస్త అంతర్గత విభేదాలు వల్ల దెబ్బతింది. ఇటీవల పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు పోరు నడిచింది. పార్టీ పదవుల పంపకాల విషయంలో రచ్చ నడిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీలోని విభేదాలని తగ్గించడానికి చూశారు. దిగ్విజయ్ వచ్చాక..కాస్త పార్టీలో పరిస్తితులు సద్దుమణిగాయి.

అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పాదయాత్రతో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు.  ‘హాత్‌సే హాత్‌ జోడో’ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 26న భద్రాచలంలోని రాములవారి సన్నిధి నుంచి రేవంత్ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 99 నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర కొనసాగనుందని తెలుస్తోంది.

జనవరి 26న మొదలయ్యే పాదయాత్ర..జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ముగియనుంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే దాని బట్టి పాదయాత్రలో మార్పులు ఉండవచ్చు. అయితే షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రేవంత్ పాదయాత్ర చేయాలని చూస్తున్నారు గాని..సీనియర్లు ఏదొక రూపంలో అడ్డంకి పెట్టారనే ప్రచారం ఉంది. అయితే పాదయాత్ర షెడ్యూల్ ఫిక్స్ అయింది. మరి ఇప్పుడు రేవంత్ పాదయాత్రకు సీనియర్లు ఏ మేర సహకరిస్తారనేది చూడాల్సి ఉంది.

అయితే ఆ మధ్య కొన్ని రోజులు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర తెలంగాణలో జరిగింది. పాదయాత్రకు మంచి స్పందన వచ్కింది గాని..దాన్ని కాంగ్రెస్ నేతలు యూజ్ చేసుకోలేదు. ఏ అంతర్గత విభేదాలతో ఇంకా నష్టం చేశారు. మరి ఇప్పుడు రేవంత్ పాదయాత్ర వల్ల పార్టీకి ఏం ఒరుగుతుందో చూడాలి.