పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం… పాఠ్యాంశంగా అతని జీవిత చరిత్ర!

కన్నిడుగుల ఆరాధ్య నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు ప్రజానీకానికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన కాలం చేసిన తరువాతనే జనాలు ఆయన ప్రత్యేకతలు గుర్తించారు. కాగా ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చింది బెంగుళూరు యూనివర్సిటీ. అవును, దానికి అతను వంద శాతం అర్హుడు. సినిమాల్లో తన నటనతోనే కాకుండా పలు సేవ, సహాయక కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకున్న కలియుగ దానకర్ణుడు పునీత్ రాజ్ కుమార్.

పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందడం అందరికీ తెలిసిందే. దాంతో ఆయన అభిమానులతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్రంగా కృంగిపోయింది. కాగా తాజాగా ఆయన మరణం అనంతరం బెంగుళూరు యూనివర్సిటీ బీకాం సిలబస్‌లోని వాణిజ్య కన్నడ-3 అనే పాఠ్య పుస్తకంలో పునీత్‌ లైఫ్ స్టోరీని చేర్చడం విశేషం. 3వ సెమిస్టర్ విద్యార్ధులు ఇకపై పునీత్‌ జీవితంలోని కొన్ని సంఘటనలను పాఠ్యాంశంగా చదువుకోవడం ఆయన అభిమానులు గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానగళం సంబరాలు చేసుకుంటున్నారు.

ఇకపోతే ప్రముఖ కన్నడ జర్నలిస్ట్ శరణు హుల్లూర్ పునీత్ రాజ్ కుమార్ ని ఉద్దేశించి ‘నేనే రాజకుమార’ అనే పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని పునీత్‌ సతీమణి ‘అశ్విని పునీత్ రాజ్ కుమార్’ ఇటీవలే విడుదల చేశారు. కాగా అందులోని నుంచి కొంత సమాచారాన్ని డిగ్రీ పాఠ్య పుస్తకంలో చేర్చడం జరిగింది. బెంగుళూరు యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే పునీత్ మరణం తర్వాత ఆయన అభిమానులు కన్నడ సూపర్‌స్టార్ జీవిత కథ, చేపట్టిన కార్యక్రమాలను పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బెంగళూరు యూనివర్శిటీ సూపర్ స్టార్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం స్ఫూర్తిదాయకమని కన్నడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.