ఇంతవరకూ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా సత్తా చూపలేని టాలీవుడ్ బడా హీరోలు వీరే!

టాలీవుడ్ పరిస్థితి నేడు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మంచి మంచి కంటెంట్ తెలుగు పరిశ్రమ నుండి రావడంతో ఇతర పరిశ్రమలవారు ఇక్కడి సినిమాలను రీమేక్స్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా పేరు విశ్వవ్యాప్తం అయింది. RRR సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసినదే. నేటికీ దాని ఉనికిని చాటుకుంటోంది అంటే అంతా జక్కన్న పుణ్యమే. ఇలాంటి పరిశ్రమలో కొంతమంది బడా హీరోల ఫ్యామిలీనుండి వచ్చిన వారసులు మాత్రం బాక్షాఫీస్ వద్ద కాస్త తడబడుతున్నారు.

అక్కినేని నట వారసులుగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ సినిమాలు చేస్తున్నారు గాని, అనుకున్న స్థాయిలో ఏ ఒక్క సినిమా ఆడకపోవడం కొసమెరుపు. మొదట్లో నాగ చైతన్య రెండు మూడు సినిమాలు బాగా ఆడినప్పటికీ సూపర్ సక్సెస్ అనేమాట రాలేదు. మాస్ ఇమేజ్ వచ్చే స్థాయి సినిమాలు వీరినుండి రాలేదు. ఇక అఖిల్ మాట చెప్పనవసరం లేదు. ఓ మాదిరి హిట్ కూడా మనోడికి పడలేకపోవడం దురదృష్టకరం అని చెప్పుకోవాలి.

ఆ తరువాత మెగా మేనల్లుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరినుండి ఓ మాదిరి సినిమాలైతే వచ్చాయి గాని, బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన దాఖలాలు మాత్రం లేవు. వీరి తరువాత వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ నుండి వచ్చిన తొలి సినిమా ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో ఆడింది. ఆ ఆరువాత నారా ఫామిలీ నుండి వచ్చిన నారా రోహిత్ గురించి చెప్పుకోవాలి. మొదట్లో ఒకటి అరా సినిమాలు బాగా వున్నాయి అనిపించుకున్నా… ఇపుడు ఎక్కడున్నాడో చెప్పడం కష్టం. ఇలా బడా ఫామిలీ నుండి వచ్చిన కొంతమంది హీరోలు ఆ స్థాయి సినిమాలు ఇవ్వకపోవడం ఒకింత బాధాకరం.