పుష్పశ్రీకి భారీ షాక్..కురుపాం టీడీపీకి దక్కేనా!

ఏజెన్సీ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని విషయం తెలిసిందే. ఏజెన్సీల్లో మొదట కాంగ్రెస్ హవా నడిచేది.ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇక ఏజెన్సీలో కీలకంగా ఉన్న కురుపాం స్థానంలో కూడా గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పుష్పశ్రీ వాణి గెలుస్తూ వచ్చారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక గిరిజన శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

కానీ రెండున్నర ఏళ్లలో ఆమె పదవి పోయింది..ఇక మంత్రిగా ఉన్నప్పుడు..ఆమె అనుకున్న స్థాయిలో మంచి పనితీరు కనబర్చలేదు. గిరిజన శాఖ మంత్రిగా ఉంటూ..అదే గిరిజనులకు న్యాయం చేయడంలో పుష్పశ్రీ విఫలమయ్యారని చెప్పవచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే..ఆమె మంత్రి అనే సంగతి రాష్ట్రంలో చాలామంది ప్రజలకు తెలియదు..అంటే ఆమె పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మంత్రి పదవి పోయాక ఎమ్మెల్యేగా కూడా అంత అనుకున్న స్థాయిలో రాణించడం లేదని తెలుస్తోంది.

కాస్త ఈ మధ్య మాత్రం గడపగడప కార్యక్రమంలో తిరుగుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఇక్కడ పుష్పశ్రీకి అనుకున్న స్థాయిలో పాజిటివ్ లేదు. పైగా సొంత కుటుంబమే వ్యతిరేకంగా మారింది. పుష్పశ్రీ ఆడపడుచు పల్లవి రాజు టీడీపీలో చేరారు. అటు మామ వరుసయ్యే శతృచర్ల విజయరామరాజు టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు వారే కురుపాంలో టీడీపీని నడిపిస్తున్నారు.

అయితే గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరుపున జనార్ధన్ ధాట్రాజ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈయన శత్రుచర్లకు మేనల్లుడు అవుతారు. కానీ ఆ మధ్య అనారోగ్యంతో చనిపోయారు. జనార్ధన్ తల్లి కూడా చనిపోయారు. దీంతో కురుపాం టీడీపీ సీటు కోసం ఓ వైపు పల్లవి రాజు, మరోవైపు జనార్ధన్ భార్య కూడా ఆశిస్తున్నారు. ఇక అంతా కలిసికట్టుగా పనిచేసేలా బాబు తాజాగా దిశానిర్దేశం చేశారు. ఎలాగైనా ఇక్కడ గెలవాలని చెప్పి శత్రుచర్లకు టార్గెట్ పెట్టారు.

ఇదే క్రమంలో తాజాగా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి సొంత మండలానికి చెందిన జియ్యమ్మవలస ఎంపీపీ బొంగు సురేష్‌ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సురేష్‌ పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, అనుచరులతో కలిసి విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఉన్న చంద్రబాబును కలిశారు. దీంతో పుష్పశ్రీకి షాక్ తగిలినట్లు అయింది. ఇదే దూకుడుని కొనసాగిస్తే కురుపాం సీటు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది.