ఏపీ బీజేపీలో విభేదాలు నిదానంగా బయటపడుతున్నాయి. మామూలుగానే ఆ పార్టీకి ఉన్న బలం అంతంత మాత్రమే. ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. పైగా ఇప్పుడు ఆ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక గ్రూపు వైసీపీకి అనుకూలంగా, మరో గ్రూపు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి.
అయితే టీడీపీతో జనసేన పొత్తు గాని బీజేపీ కూడా కలిసే విషయంలో కొందరు బీజేపీ నేతలు అడ్డు చెబుతున్నారని, కేవలం జనసేన-బీజేపీ కలిసి వెళ్ళేలా ప్లాన్ చేసి..ఓట్లు చీల్చి పరోక్షంగా వైసీపీకి బెనిఫిట్ అయ్యేలా చేయాలని చెప్పి బీజేపీలో ఉన్న ఓ వర్గం గట్టిగా ట్రై చేస్తుందని తెలిసింది. ముఖ్యంగా అధ్యక్షుడు సోము వీర్రాజు పూర్తిగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో మరొక వర్గం టీడీపీతో పొత్తు సెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీ జనసేనలతో బీజేపీ కలిస్తే నాలుగైదు సీట్లు అయిన వస్తాయని భావిస్తున్నారు.
అందుకే టీడీపీతో పొత్తుకు వారు మొగ్గు చూపుతున్నారు. ఈ అంశంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాస్త టీడీపీకి పాజిటివ్ గా ఉన్నారని తెలిసింది. టీడీపీతో పొత్తు ఉంటేనే బెటర్ అని చూస్తున్నారట. ఈ క్రమంలోనే కన్నా-సోముల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి.. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఈ భేటీతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. నాదెండ్ల మనోహర్ మాత్రం దాన్ని ఖండించారు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అంటే వారి మధ్య పొత్తుల గురించి చర్చ జరిగి ఉంటుందని ప్రచారం వస్తుంది. మరి చివరికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చూడాలి.