పుష్ప ది రూల్‌.. ఈ సారి అన‌సూయ‌తోనే ఆ ప‌ని కానిచ్చేస్తున్నార‌ట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, ఫ‌హాద్ ఫాజిల్‌, అనసూయ, ధనుంజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రల‌ను పోషించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించాడు.

విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ ఈ సినిమాలో `ఊ అంటావా ఊ ఊ అంటావా` అంటూ స‌మంత ఐట‌మ్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా పుష్ప ది రూల్‌ రాబోతోంది. ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళింది. సీక్వెల్ లో కూడా ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది.

అయితే ఈసారి ఐటెం సాంగ్ ను అనసూయ తోనే కానిచ్చేస్తున్నారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. తొలి భాగంలో అనసూయ పాత్ర తన భర్త మంగళం శ్రీను(సునీల్‌)ని చివర్లో కత్తితో పొడిచేస్తుంది. అయితే, మంగళం శ్రీను చనిపోడు. పుష్ప తనకు కలిగించిన నష్టం నేపథ్యంలో.. అతని మీద మంగళం శ్రీను ‘పుష్ప ది రూల్’లో తిరగబడతాడట. అనసూయ కూడా పుష్ప మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ట‌. ఈ క్రమంలోనే ఓ హాట్ అండ్ వైల్డ్ ఐటమ్ సాంగ్ ఉంటుందని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.