అప్పుడప్పుడు రావడం చంద్రబాబుపై విమర్శలు చేయడం, ఫ్యామిలీ పరమైన అంశాలని వివాదాస్పదం చేయడం, జగన్‌కు భజన చేయడం అనేది లక్ష్మీపార్వతికి ఓ టాస్క్ మాదిరిగా ఉందని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్య యూనివర్సిటీకు ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు వచ్చి..జగన్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు..అలాంటప్పుడు చిన్న యూనివర్సిటీకి పేరు తీయడం వల్ల ఏం కాదని చెప్పుకొచ్చారు.
మళ్ళీ ఇప్పుడు ఆమె ఎంట్రీ ఇచ్చి..టీడీపీ బాధ్యతలు నందమూరి ఫ్యామిలీలో ఎవరోకరికి ఇవ్వాలని అంటున్నారు. చంద్రబాబు జీవితం 2019 ఎన్నికలతో ముగిసిపోయిందని.. పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో ఊగిసలాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్లకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
అలాగే నారా లోకేష్ పాదయాత్ర చేసి ఉద్దరిస్తానని అంటున్నారని.. లోకేష్‌పై ప్రజలకు నమ్మకంలేదని, చంద్రబాబు ఇక భాద్యతలు మరొకరికి ఇస్తే మంచిదని, నారా లోకేష్‌కు ఇచ్చి మరో తప్పు చెయ్యవద్దని.. నందమూరి కుటుంబంలో ఎవరికి హక్కు ఉందో వారే ముందుకు రావాలని, ఎవరనేది వారే నిర్ణయించుకుంటారన్నారు.
అంటే బాబు పని అయిపోయిందని, టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు ఇవ్వవద్దని, నందమూరి ఫ్యామిలీకి ఇవ్వాలని అంటున్నారు. అయితే ఇక్కడ బాబు పని అయిందో లేదో, లోకేష్‌కు సత్తా ఉందో జనం తేలుస్తారు..ఒక్క ఎన్నికలో ఓడిపోతే లోకేష్‌పై జనాలకు నమ్మకం లేదని చెప్పడం కరెక్ట్ కాదు. అటు పవన్ సత్తా ఏంటో కూడా తెలిసిందే. పైగా మళ్ళీ గెలవరని లక్ష్మీపార్వతి జోస్యం చెబుతున్నారు..జోస్యం అనేది అన్నిసార్లు నిజం అవ్వదు.
ఇక యథావిధిగా బాబుపై విమర్శలు చేసిన ఆమె..జగన్‌కు భజన కూడా చేశారు. మూడేళ్ల తర్వాత కూడా జగన్ కోసం ప్రజలు ఎంతగానో పరితపిస్తున్నారో అర్ధమవుతుందని, జగన్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, మరోసారి వైసీపీ విజయం ఖాయమని ఇంకో సారి జోస్యం చెప్పారు.