టీడీపీ ఎంపీ, దూకుడు నాయకుడిగా పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ తాజాగా తన కు చెందిన అమర రాజా బ్యాటరీ కంపెనీని తెలంగాణకు తరలించేశారని, దీనివల్ల ఏపీకి తీవ్ర నష్టం వచ్చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ అసమర్థత, వేధింపులు.. టార్గెట్ కారణంగానే గల్లా కంపెనీ వెళ్లిపోయిందని అనేక రూపాల్లో దీనిపై దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో 9500 కోట్ల మేరకు తెలంగాణకు పెట్టుబడులు సమకూరుతున్నాయని కూడా చెబుతున్నారు.
ఇది నిజమే. వచ్చే 2030 నాటికి దేశంలో బ్యాటరీ వాహనాలు మాత్రమే ఉండాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు.. లిథియం అయాన్ బ్యాటరీలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమర రాజా కూడా తన కంపెనీని విస్తరించింది. అయితే, రాజకీయంగా గల్లా కంపెనీపై పడిన ముద్ర, వేధింపుల కారణంగా ఆ కంపెనీ తరలిపోతోందనేది నేటి వార్త. కానీ, వాస్తవాలు చూస్తే.. కొంచెం విరుద్ధంగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
లిథియం అయాన్ కంపెనీని విస్తరించాలని అనుకుంటున్న గల్లాకు ఏపీలో వనరులు ఉన్నాయి. అయితే, ఇక్కడ నిబంధనలు పాటించాలని, ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. పోనీ.. వీటికి గల్లా కంపెనీ ఇష్టపడకపోతే.. ఎలాగూ.. 2024లో టీడీపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది కాబట్టి.. తమకు తిరుగు లేదు కాబట్టి.. అప్పటి వరకు అంటే ఏడాది న్నర సమయం వేచి చూడొచ్చుకదా! అనేది ప్రశ్న, ఇప్పుడేఎందుకు ఇంత తొందర అని ప్రశ్నిస్తున్నారు.
కానీ, గల్లా మాత్రం అలా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే.. నిజంగానేఆయన ఎక్కడ ఏం కోరినా చేసేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారు. కానీ, గల్లా మాత్రం పోయి పోయి తెలంగాణను ఎంచుకున్నారు. ఇది రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం అనే విషయంపై గల్లా అనుమానంతో ఉన్నారా? టీడీపీ ఎలాగూ వచ్చే పరిస్థితి లేదని ఆయన నిర్ణయించుకున్నారా? అనేది ప్రశ్న. అందుకే.. ఆయన తన పెట్టుబడులను తెలంగాణకు తరలించారా? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇదే నిజమైతే.. టీడీపీకి దెబ్బ తగులుతుందని అంటున్నారు.