బాబు కొత్త నినాదం..’బై బై బాబు’లా క్లిక్ అవుతుందా!

రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పార్టీలు రకరకాల వ్యూహాలతో వస్తాయి. సరికొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్తారు. అవి క్లిక్ అయితే పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి నినాదాలతోనే  టీడీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్లారు. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంతో ముందుకెళుతున్నారు. అంటే జగన్ వచ్చాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, అసలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారనే కాన్సెప్ట్‌తో పనిచేస్తున్నారు.

ఈ రెండు కార్యక్రమాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇదే సమయంలో బాబు ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక బాబు రోడ్ షోలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. బాబు పర్యటనలు ఆలస్యంగా సాగిన సరే..ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది..ఇక తాజాగా గుంటూరు జిల్లాలో బాబు పర్యటించారు. పొన్నూరు నియోజకవర్గంలో బాబు పర్యటించగా, అక్కడ భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.

ఊహించని స్థాయిలో ప్రజలు రావడంతో..బాబు మంచి జోష్‌తో ప్రసాగించారు..నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నారు. చాలాసేపు ప్రసాగించారు. జగన్‌రెడ్డి ఐరన్‌లెగ్‌ సీఎం.. ఎక్కడ కాలుపెడితే అక్కడ మటాష్‌ అయిపోవడమే అని, ప్రమాణ స్వీకారం చేయగానే పోలవరం కాంట్రాక్టు సంస్థను మార్చి ప్రాజెక్టును గోదావరిలో కలిపేశాడని, నాడు ప్రత్యేక హోదా అని ఎన్నెన్నో మాటలు చెప్పి ఎంపీలను గెలిపించుకుని.. ఆయన కేసులు వాదించే వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇచ్చాడని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా, ఏ ఒక్కరిని కదిలించినా ‘సైకో పాలన వద్దు.. సైకిల్‌ పాలన రావాలి’ అని కోరుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ‘సైకో వద్దు..సైకిల్ రావాలి’ అని నినాదంతో ముందుకొచ్చారు. గతంలో వైసీపీ బై బై బాబు అనే నినాదంతో ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బాబు సైకో వద్దు..సైకిల్ రావాలి అని నినాదం అందుకున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.