తెలంగాణ టీడీపీలో జోష్..ఖమ్మంలో బాబు..భారీ వ్యూహం.!

చాలా రోజుల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాస్త జోష్ కనిపిస్తోంది..రాష్ట్ర విభజన తర్వాత…ఆ పార్టీని నేతలు వరుసపెట్టి వీడిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటు అధ్యక్షుడుగా పనిచేసిన ఎల్ రమణ సైతం పార్టీని వీడారు. దీంతో ఇంకా టీడీపీకి ఎండ్ కార్డు పడిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత బక్కని నర్సింహులుని అధ్యక్షుడుగా పెట్టారు గాని..పెద్దగా ప్రయోజనం లేదు.

ఇక దీంతో తెలంగాణలో టీడీపీ పేరు వినబడటం ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరారో అప్పటినుంచి సీన్ మారింది. పైగా ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి టీడీపీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. కాసాని సైతం..దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులని, కార్యకర్తలని యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చేయిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకెళుతుంది.

ఇక పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చేలా.. ఖమ్మంలో భారీ సభకు ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని పురస్కరించుకుని..ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారు. నేడు ఆ సభకు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. చంద్రబాబు వస్తుండటంతో..సభకు భారీగా హాజరైందుకు టీడీపీ శ్రేణులు చూస్తున్నాయి. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్  అయితే ఇంకా తెలంగాణలో పార్టీకి కొత్త ఊపు వస్తుంది.

ఆ దిశగానే బాబు కూడా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఆయన పూర్తిగా ఏపీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి..తెలంగాణ నేతలకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరుపున సభలు ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాలని కాసాని చూస్తున్నారు. మరి ఖమ్మం సభ సక్సెస్ అయితే..దాని బట్టి తెలంగాణ టీడీపీలో జోష్ పెరిగే ఛాన్స్ ఉంది.