ముందస్తు వదలని బాబు..జగన్ ప్లాన్ అదే.!

ముందస్తు ఎన్నికల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వదలడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి బాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని, టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు.

అయినా బాబు వర్షన్ ముందస్తుపైనే ఉంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, అందుకే జగన్ ముందస్తుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారని, ఎప్పుడు ఎన్నికలోచ్చిన టీడీపీ నేతలు రెడీగా ఉండాలని బాబు అంటున్నారు. తాజాగా టీడీపీ సమావేశంలో బాబు మళ్ళీ ముందస్తు గురించి మాట్లాడారు. వ్యతిరేకత పెరుగుతోందన్న విషయం అర్థమయ్యేసరికి ఎన్నికల విషయంలో జగన్‌ ఆలోచన చేస్తున్నారని, వచ్చే మే నెలలో ఎన్నికలకు వెళ్లాలా..?లేదా అక్టోబరులో వెళ్లాలా? లేక షెడ్యూల్‌ ప్రకారం 2024లో వెళ్లాలా? అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నూటికి వెయ్యి శాతం వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని బాబు అంటున్నారు. అంటే జగన్ ఏం ఆలోచిస్తున్నారో కూడా బాబు చెప్పేస్తున్నారు. అయితే బాబు పదే పదే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడటానికి కారణాలు లేకపోలేదు. ఇలా ముందస్తు అని టీడీపీ నేతలని, శ్రేణులని ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంచవచ్చు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కునేలా నేతలు రెడీ అవుతున్నారు.

అందుకే పదే పదే ఈ ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతున్నారు. అయితే బాబు అనుకున్నట్లు వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే..టీడీపీకి అనుకున్న విధంగా పాజిటివ్ కనిపించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా కనిపించడం లేదు. అదే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. మరి చూడాలి బాబు చెప్పినట్లు జగన్ ముందస్తుకు వెళ్తారో..లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారో.