ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామని కొందరు నాయకులు అంటున్నా వాస్తవంగా చూస్తే అసలు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు కలుగుతున్నాయి. రీసెంట్గా మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత జిల్లా కడపకే చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నానని చెబుతున్నారు. అయితే ఆయన జగన్ పై విమర్శలు చేశాక ఆ పార్టీ నేతలు ఎవ్వరూ కూడా ఆయన మా పార్టీ నాయకుడే అని ఎక్కడా ప్రస్తావించలేదు.
అయితే డీఎల్ మాత్రం తాను వైసీపీ నేతనే అని చెప్పుకుంటున్నారు. ఇక మరో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కూడా వైసీపీ నాయకుడిననే అంటున్నారు. గాదె గత ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కోసం.. వైసీపీలో చేరారు. కానీ, దక్కలేదు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పేరుకు వైసీపీ .. కానీ ఉన్నారో లేదో తెలియట్లేదు. ఇక మరో నేత మరో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు.
ఈయన ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు. ఈయన కూడా వైసీపీలో నే ఉన్నానని అని చెప్పుకుంటున్నా వైసీపీ నేతలు మాత్రం ఆయన పేరు ఎక్కడా చెప్పట్లేదు. పేరుకు మాత్రం ఆయన కొడుక్కి ఓ పదవి ఇచ్చారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో నాయకుడు కొణతాల రామకృష్ణ. ఆయన కూడా మాజీ మంత్రియే. ఆయన కూడా గతంలో ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి రాజకీయ పార్టీ అంటూ గతంలో హడావుడి చేశారు.
ఎన్నికలకు ముందు జగన్ దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఎవ్వరికి తెలియదు. ఇలా ఈ నేతలు వైసీపీలో ఉన్నారా ? లేరా ? అన్నది వాళ్లకు తెలియదు. ఆ పార్టీ వాళ్లకు తెలియదు అన్నట్టుగా ఉంది.