కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. దాంతో టాలీవుడ్ బడా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మురంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సక్రాంతి బరిలో ఓ మూడు బడా సినిమాలు రిలీజుకి సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు సెట్స్‌పై ఉన్న ప్రభాస్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ చిత్రాల వరకూ చాలా ప్రతిష్టాత్మక సినిమాలు సినీ ప్రియుల్ని ఊరిస్తున్నాయి.
కరోనా కష్టకాలం నుండి గట్టెక్కిన చిత్రసీమ వచ్చే యేడాది మాత్రం జెట్ స్పీడ్ తో ప్రయాణిస్తుందనే సంకేతాలు మెండుగా వినిపిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులకి సంబంధించిన పనులు చకచకా సాగుతుండడమే అందుకు నిదర్శనం. అందుకే ఇప్పుడు కొత్త జోడీ ముచ్చట్లు మరింత జోరుగా ఊపందుకున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సినిమాలో మొదట కథానాయికగా అలియాభట్‌ని అనుకున్నా తరువాత కొన్ని కారణాల వలన రష్మికను తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే జాన్వీ కపూర్ రామ్‌చరణ్‌తో రాబోయే సినిమాలో జోడీ కట్టే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం కూడా జాన్వీని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్ త్వరలో కొత్తగా రెండు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. అందులో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా ఒకటి. ఈ సినిమాలో మొదట పూజాహెగ్డే అనుకున్నప్పటికీ వేరొకరిని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక మహేష్‌బాబు – త్రివిక్రమ్ కలయికలో సినిమా కోసం పూజాహెగ్డే, శ్రీలీల ఖరారైన సంగతి తెలిసిందే.