టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నేటి తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
తెలుగు చిత్ర పరిశ్రమ లో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకపోతే కృష్ణ మరణంతో ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణకు సూపర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిజానికి కృష్ణ సూపర్ స్టార్ అనే బిరుదును ఎలా సొంతం చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అసలేం జరిగిందంటే.. సినీ వారపత్రిక శివరంజని ఓ సందర్భంలో `తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారు..?` అన్నదానిపై ఓటింగ్ నిర్వహించిందట. అయితే ఈ ఓటింగ్ లో కృష్ణ తిరుగులేని మెజారిటీతో టాప్ ప్లేస్ లో నిలిచారు. దాంతో ఆయన అప్పటినుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయారు. ఇక సూపర్ స్టార్ బిరుదు కంటే ముందు కృష్ణను `నటశేఖర్`, `డేరింగ్ అండ్ డాషింగ్` అనే బరుదులతో పిలుచుకునేవారు.