ఏపీలో కులాల ఆధారంగా నాయకులని తిట్టించడంలో అధికార వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి..చంద్రబాబుని కమ్మ వర్గం నేతల చేత, పవన్ కల్యాణ్‌ని కాపు వర్గం నేతల చేత తిట్టిస్తుంటారు. ఇటీవల పవన్ మరింత దూకుడుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే తాజాగా జగనన్న కాలనీల్లో వేల కోట్లు అవినీతి జరిగిందని ఫైర్ అయ్యారు. కాలనీలు పరిశీలించి అక్కడ పరిస్తితులని చూపించారు. ఇక జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూముల సేకరణ, ఇళ్ల స్థలాలు పంచడం, చదును చేయడం, ఇళ్ల నిర్మాణాల విషయంలో అవినీతి జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణలు.
మరి వీటిల్లో వాస్తవం ఎంతో ఉందో వైసీపీ నాయకులకు తెలుసు, అలాగే ప్రజలకు తెలుసు. పైగా సెంటు, సెంటున్నర స్థలాల్లో ఎంత ఇల్లు పడుతుందో తెలిసిందే. ఇక గత చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు రాగులు వేసి, వైసీపీ వాళ్ళకు ఇస్తున్న విషయం తెలుసు. వీటిపై గతంలో టీడీపీ, ఇప్పుడు పవన్ గళం ఎత్తారు. ఇప్పుడు పవన్ స్పందించడంతో ఆయనకు కౌంటరుగా వైసీపీలో ఉన్న కాపు మంత్రులు స్పందింస్తున్నారు.
తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ.. మోదీని కలిసి వచ్చిన తర్వాత పవన్ నోరు తగ్గించుకున్నారని, జగనన్న కాలనీలపై సోషల్ ఆడిట్ అంటూ పవన్ తప్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీలకు వెళ్లి సోషల్ ఆడిట్ చేస్తే మహిళలందరూ.. చీపురుకట్ట తిరగేసికొట్టే పరిస్థితి ఉందని హెచ్చరించారు. చంద్రబాబు ఎలా చెబితే పవన్ అలా చేస్తున్నారని అన్నారు.
అయితే మహిళలు చీపురులతో కొడతారని మంత్రి అనడంపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొట్టు నోటికి తాళం పడటం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు జగన్ మెప్పు కోసం, మంత్రి పదవి కోసం నోరు పారేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పదవి కాదు కదా..ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమని ఫైర్ అవుతున్నారు. ఇక టిడిపి-జనసేన గాని కలిస్తే తాడేపల్లిగూడెంలో కొట్టు పరిస్తితి అస్సామే.