కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు.
ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు ఆయనపై ఫిర్యాదులు చేయలేదు కానీ.. అంతకు మించిన వ్యాఖ్యలే చేశారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోరని.. పార్టీ అంటే లెక్కేలేదని వెల్లడించారు. అదేసమయంలో పుట్టపర్తిలో రఘునాథరెడ్డికి అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా బాబు దృష్టికి తెచ్చారు. అదేసమయంలో టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడుకు బదులుగా.. సొంత కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు.
పార్టీలో ఆయన ఉంటూనే పార్టీ కండువా కప్పుకోకుండా, పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా.. వ్యవహరిస్తుండడంతో తాము ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేక పోతున్నామన్నారు. కేవలం పైపైనే కార్యక్రమాలు చేపట్టి మమ అనిపిస్తున్నామని.. జేసీ బ్రదర్స్‌ను లైన్‌లో అయినా.. పెట్టాలని.. లేదా ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌లనైనా మార్చాలని తాడిపత్రి కౌన్సిల్ సభ్యులు బాబుకు తెగేసి చెప్పినట్టు టీడీపీలోచర్చ సాగుతోంది.
అయితే, చంద్రబాబు మాత్రం అవన్నీ తనకు వదిలేయాలని.. త్వరలోనే ప్రారంభించనున్న ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటించాలని సూచించారు. కానీ, నాయకులు మాత్రం పదేపదే జేసీ బ్రదర్స్ గురించే చెప్పడం.. గమనార్హం. మరి వారిని మారుస్తారో. లేక తనే మారతారో చూడాలని అంటున్నారు సీనియర్లు.