కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్..జగన్‌కు చెక్ ఎలా?

మరోసారి వైసీపీ సర్కార్‌పై పవన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటం బాధితులకు..మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సాయం అందించారు. ఇళ్ళు కూల్చివేతల్లో బాధితులుగా ఉన్నవారికి లక్ష చొప్పున సాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఫైర్ అయ్యారు.

రాజకీయంగా మీరే చేయాలా? మేము ఏంటో చూపిస్తామని, ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దలుగొడతామని అన్నారు. తమది రౌడీ సేన కాదని, విప్లవ సేన అని..ఇప్పటంలో గడపలు కూల్చిన అంశాన్ని తాను మరిచిపోనని అన్నారు. 2014 తర్వాత ప్రధానిని నాలుగుసార్లు కలిశానని, ప్రధానితో ఏం మాట్లాడానో చెప్పాలని సజ్జల అడుగుతున్నారని..ఆయన వస్తే చెవిలో చెబుతానని అన్నారు. వైసీపీ నాయకులు మాదిరిగా ఢిల్లీకి వెళ్ళి చాడీలు చెప్పానని, వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని, తాను అనుకున్నదే చేస్తానని, ఆంధ్రాలో పుట్టా..ఆంధ్రాలోనే తేల్చుకుంటానని చెప్పుకొచ్చారు. అధికారం లేనివాడి మీద పడి ఏడుస్తున్నారని, అయితే తన సత్తా ఏంటో ఈ సారి చూపిస్తానని..వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు.

అయితే పవన్ మాటల్లో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది..ఆయన పూర్తిగా వైసీపీని టార్గెట్ చేశారని అర్ధమవుతుంది. కాకపోతే వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని అంటున్నారు..జనసేన సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టలేదన్న గ్రౌండ్ రియాలిటీ పవన్‌కు కూడా తెలుసు. బీజేపీతో పొత్తు ఉన్న పావలా ప్రయోజనం లేదు. ఆ విషయం కూడా  తెలుసు. ఇక వైసీపీకి చెక్ పెట్టాలంటే టీడీపీతో పొత్తు తప్పనిసరి.

మొన్నటివరకు ఓట్లు చీలనివ్వను అని చెప్పుకొచ్చారు..ఇప్పుడు జనసేన ప్రభుత్వం వస్తుందని, వైసీపీకి చెక్ పెడతామని అంటున్నారు. ప్రధానితో భేటీ తర్వాత పవన్ వర్షన్ మారింది..మళ్ళీ ఇప్పుడు వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రధానికి చెప్పి చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంటే పవన్ టీడీపీతో పొత్తులో వెళ్తారా? లేక పొత్తు పెట్టుకోరా? అనేది క్లారిటీ లేదు. కానీ టీడీపీతో పొత్తు లేకుండా వైసీపీని దెబ్బకొట్టడం పవన్‌కు సాధ్యం కాదు.