టీడీపీలోకి సూరి..పరిటాల శ్రీరామ్‌కు షాక్ రెడీ..?

వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పరిటాల శ్రీరామ్ ఎప్పటినుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. అటు రాప్తాడులో తన తల్లి సునీతమ్మ పోటీ చేయనున్నారు. ఇలా పరిటాల ఫ్యామిలీ రెండు సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే చంద్రబాబు..రాప్తాడు సీటు క్లారిటీ ఇచ్చారు గాని..ధర్మవరం సీటు క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ వరదాపురం సూరికి సీటు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సూరి..బీజేపీలోకి వెళ్లారు. అయితే మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఆయన అనుచరులు సైతం ధర్మవరం సీటు సూరిదే అంటున్నారు. కానీ శ్రీరామ్ మాత్రం ధర్మవరం తనదే అని, ఎవరోచ్చినా ఏం చేయలేరని, ఒకవేళ సీటు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఇక అలా ధర్మవరం సీటు తనదే అని శ్రీరామ్ పనిచేస్తున్నారు. అలాగే వైసీపీపై గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు బాబు, లోకేష్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సునీతమ్మతో కలిసి గట్టిగా పోరాడారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

ఇలాంటి తరుణంలో టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే బీజేపీలో ఉన్న సూరి..ధర్మవరంలో క్యాంపు ఆఫీసు ఓపెన్ చేస్తే..దానికి రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు వచ్చారు. ఇటీవల సూరి..బాబుని కలిసి ధర్మవరం సీటు అడిగారని తెలిసింది. ఇక్కడ ఆర్ధికం అయ్యే ఖర్చు అంతా భరిస్తానని, ఇంకో నియోజకవర్గంలో కూడా ఆర్ధికంగా సాయం చేస్తానని చెప్పినట్లు సమాచారం. లోకేష్ పాదయాత్రలో సూరి టీడీపీలో చేరతారని తెలిసింది.

దీంతో సూరి వైపే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. పైగా పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు ఇవ్వడం వల్ల టెన్షన్ పెరుగుతుందని, అలా కాకుండా ఒక సీటు ఇస్తే..ఒకరు పోటీ చేస్తే మరొకరు గ్రౌండ్ వర్క్ చేయడానికి కుదురుతుందని, రెండు సీట్లు ఇస్తే కార్యకర్తలు విడిగా పనిచేయాలి దానివల్ల టీడీపీకి నష్టమని అంచనా వేస్తున్నారు. కాబట్టి పరిటాల ఫ్యామిలీకి రాప్తాడు ఇచ్చి, సూరికి ధర్మవరం సీటు ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే శ్రీరామ్‌కు షాక్ ఇచ్చినట్లే. మరి బాబు చివరి నిర్ణయం ఏంటో చూడాలి.