నందమూరి నట వారసుడు బాలయ్య గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య బాలయ్య వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నవ్వులు పోయిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోలు కేవలం వెండితెరకే పరిమితమయ్యేవారు. కానీ ఇపుడు కాలం మారింది. బుల్లితెర షోలకు కూడా వారికి దండిగా డబ్బులు సమర్పిస్తుండటంతో టీవీ, ఓటీటీలపై కూడా పలువురు స్టార్లు దుమ్ము లేపుతున్నారు. అయితే వారిలో ప్రథముడు మాత్రం బాలయ్య అనే చెప్పుకోవాలి. అంతలాగ అతను తనదైన మేనరిజంతో దుమ్ము దులుపుతున్నారు.
ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్ ను మించి సెకండ్ సీజన్ ఉందని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ బాలయ్య హోస్టింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య హోస్ట్ గా కొనసాగినన్ని రోజులు అన్ స్టాపబుల్ షోకు తిరుగులేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య హోస్ట్ గా భవిష్యత్తులో కెరీర్ ను కొనసాగించాలని కూడా నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య ఈ షో కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే హోస్టింగ్ విషయంలో బాలయ్య తరహాలో హోస్ట్ చేసి జనాలను మెప్పించే వాళ్లు చాలా తక్కువని కామెంట్లు బాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్య కంటే ముందే నాగార్జున, ఎన్టీఆర్, చిరంజీవి పలు టీవీ షోలు చేసినప్పటికీ వీరెవ్వరికీ రాని స్టార్ డం బాలయ్యకి వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయంలో ఇక బాలయ్యను మించి ఎవరూ రారని నందమూరి అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇకపోతే బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ షూట్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో అన్ స్టాపబుల్ షో సీజన్2 కు బాలయ్య ఎక్కువ సంఖ్యలో డేట్లు కేటాయించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.