టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదే సినిమాలోని ఓ 4 మంది హీరోలలో నిఖిల్ ఒక్కడే సక్సెస్ కావడం గమనార్హం. ఇక ఇటీవలికాలంలో కార్తికేయ 2 సినిమాతో యావత్ పాన్ ఇండియా స్థాయిలో కూడా నిఖిల్ అలరించాడు. నిఖిల్ లో వున్న మరో మంచి అంశం ఏమంటే… తనకి నచ్చని విషయం ఎలాంటిదైనా మొహమాటం లేకుండా చెప్పేయడం.
తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరగగా నిఖిల్ తనదైన స్టైల్ లో స్పందించాడు. మన కోసం దేశ సరిహద్దుల్లో పోరాడే సైనికులకు, వారి కుటుంబాలకు మనం ఏం ఇచ్చినా తక్కువే అవుతుంది. వారిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉంటూనే మన సైన్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా నేరం. తాజాగా ఓ బాలీవుడ్ నటి అదే పనిచేసింది. దీంతో నెటిజన్లు, సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘బుద్దుందా’ అంటూ తిట్టిపోస్తున్నారు.
విషయం ఏమంటే, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇస్తాం’ అని ఓ ట్వీట్ చేశాడు. దీనిపై బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా ‘గల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. అంటే గల్వాన్ లో చైనా సైనికుల చేతిలో ఓడిపోయి చనిపోయిన భారత సైనికుల పరాక్రమాన్ని రిచా అవహేళనగా మాట్లాడింది అంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నిఖిల్ ఆమె ట్వీట్ ని తప్పు బడుతూ ట్వీట్ చేయడం ప్రత్యేకతని సంతరించుకుంది.