అజ్ఞాత మాజీ మంత్రి జోస్యం… టీడీపీ ప‌క్కా విన్‌…!

చెప్పుకోవ‌డానికి , విన‌డానికి కూడా బాగానే ఉండే.. కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మదే విజ‌య‌మ‌ని ఓ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత తెగ ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా ఇదే చెబుతున్నారు. ఈయ‌న మంచి యాక్టివ్‌గా ఉండే నాయ‌కుడు. అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి.. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లొచ్చారు కూడా. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు టీడీపీదే గెలుపు అని చెబుతున్నారు. మంచిదే ఎవ‌రిపార్టీని వారు ప్ర‌మోట్ చేసుకునేందుకు వెనుకాడాల్సిన అవ‌స‌రం లేదు.

అయితే..స‌ద‌రు నేత చెబుతున్న లాజిక్ మాత్ర‌మే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. “వైసీపీపై ప్ర‌జ‌లు విసిగిపోయారు. ఇంకేముంది చంద్ర‌బాబును సీఎంను చేయాల‌ని అంటున్నారు. అందుకే మా పార్టీ అధికారంలోకి వ‌స్తుంది“ అని ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. అయితే, నిజానికి ప్ర‌జ‌ల్లో ఎంత మంది విసిగిపోయారు? అనే విష‌యానికి మాత్రం ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఇటీవ‌ల జాతీయ స్థాయిలో నిర్వ‌హించిన సీఎంల స‌ర్వేలో జ‌గ‌న్ 4వ స్థానంలో ఉన్నారు. బ‌హుశ ఇది చూసి ఆయ‌న ఈ ప్ర‌చారం చేస్తున్నార‌ని భావించాలి.

కానీ, అదే స‌ర్వేలో జ‌గ‌న్ వెంట 59.6 శాతం మంది ప్ర‌జ‌లు ఉన్నార‌ని కూడా చెప్పారు. అంటే..గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వెంట నిలిచిన వారు 49.9 శాతం అయితే.. ఇప్పుడు అది ప‌దిశాతం పెరిగింది. పోనీ.. ఈ ప‌ది కూడా తీసేసినా.. గ‌తాన్ని కూడా తీసేసినా 35 శాతం లెక్క వేసుకున్నా.. అంటే.. ప‌థ‌కాలు అందుకుంటున్న‌వారు, పింఛ‌న్ల‌ను ఇంటి వ‌ద్దే తీసుకుంటున్న వృద్ధులు, రైతులు, చేనేత‌ల వంటివారిని లెక్క‌లు వేసుకున్నా జ‌గ‌న్ ఇమేజ్ ఏమీ ప‌డిపోలేదు. కొంత ఒడిదుడుకుల్లో ఉన్న మాట వాస్త‌వ‌మే. దీనిని గ్ర‌హించి.. టీడీపీ త‌న‌ను తాను బాగు చేసుకోవాల్సి ఉంది.

కానీ, ఈ రిజ‌ల్ట్‌తో జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని చెప్ప‌డం ద్వారా పార్టీని బూస్టప్ చేసుకోవాల‌ని అనుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో అన్నీ గ‌మ‌నిస్తున్న నాయ‌కు లు మాత్రం దీనిని త‌ప్పుబ‌డుతున్నారు. ఇది కాదు.. జ‌గ‌న్ ఇమేజ్ కొంత త‌గ్గిన మాట వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు. సో, ఇంత కీల‌క స‌మ‌యంలో లేనిపోనివి చెప్పి ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌న దిశ‌గా న‌డిపిస్తే అది మొత్తానికే ప్ర‌మాదం అని, అప్పుడు టీడీపీకి మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. మ‌రి మాజీ మంత్రి ఏమంటారో చూడాలి.