టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికయింది.
తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ మూవీని ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ సైతం కంప్లీట్ అయింది. మొదట ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఇక రెండో షెడ్యూల్ దసరా పండుగ అనంతరం ప్రారంభించాలని భావించారు.
ఇంతలోనే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి ఇందిరా దేవి కన్నుమూయడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో పలు మార్పులు, చేర్పులు చేశారు. ఈ మార్పుల కారణంగా తొలి షెడ్యూల్ లో రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ మొత్తాన్ని డంప్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక కొత్త స్క్రిప్ట్ తో డిసెంబర్ నెలలో మళ్లీ కొత్తగా షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.