బందరులో భారీ ట్విస్ట్..వైసీపీ లక్?

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికలు ఉండవని ఖచ్చితంగా చెప్పొచ్చు..గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి ఉండదు. టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. పైగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీని దాటి టీడీపీ లీడ్‌లోకి వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీ బలం పెరిగిందని కథనాలు వస్తున్నాయి.

ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రభావం కృష్ణా జిల్లాపై ఎక్కువ ఉంది. దీంతో ఇక్కడ వైసీపీకి నెగిటివ్ ఎక్కువ ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ బాగా పికప్ అయింది గాని..మచిలీపట్నం( బందరు) పార్లమెంట్ పరిధిలో ఇంకా వైసీపీ బలంగానే ఉందని తెలుస్తోంది. బందరు పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పెనమలూరు, గన్నవరం, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఒక్క గన్నవరంలోనే టీడీపీ గెలిచింది. మిగిలినవి వైసీపీ గెలుచుకుంది. ఇక గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ కూడా వైసీపీ వైపు వెళ్లారు. దీంతో మొత్తం వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఇప్పటికీ బందరు పార్లమెంట్ పరిధిలో వైసీపీకే లీడ్ కనిపిస్తోంది. గన్నవరం, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ స్థానాల్లో వైసీపీదే పైచేయిగా ఉంది. ఒక్క పెడనలో మాత్రమే టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. పెనమలూరు, మచిలీపట్నం స్థానాల్లో పోటాపోటి ఉంది.

ఇక అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పెనమలూరు స్థానాల్లో జనసేన ప్రభావం కాస్త ఉంది. జనసేన గెలవదు గాని , గెలుపోటములని తారుమారు చేయగలదు. ఒకవేళ పొత్తు ఉంటే ఈ నాలుగు స్థానాలు టీడీపీ-జనసేన కూటమి గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే బందరులో మళ్ళీ వైసీపీదే పైచేయి అని చెప్పొచ్చు.