రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి సైతం చమటలు పట్టించాడు.
ఇకపోతే రాజమౌళి ప్రస్థానం నేటికీ ఇలా కొనసాగుతుందంటే దానివెనుక అలుపెరగని అతని కృషి ఏంటో దాగి వుంది. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, ఎలాంటి దిగ్గజ దర్శకుడికైనా తన కెరీర్లో ఒక్క ప్లాప్ అయినా వస్తుంది. కానీ నేటికీ మన జక్కన్నను విజయం విడిచిపెట్టి ఉండటం లేదు. అవును, అపజయం ఎరుగని దర్శక ధీరుడు మన రాజమౌళి. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో 12 చిత్రాలు మాత్రమే చేసిన రాజమౌళి ఎవరూ అందుకోలేని రికార్డ్స్ సెట్ చేశారు. బాహుబలి 2 విడుదలై ఐదేళ్లు అవుతున్నా ఆ మూవీ కలెక్షన్స్ టచ్ చేసే సినిమా రాలేదు అంటే మీరు నమ్మి తీరాల్సిందే.
ఈ తరుణంలో రాజమౌళి కెరీర్ లో కూడా ఓ ప్లాప్ ఉందని చాలా మందికి తెలియదు. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. అవును, రాజమౌళి కొన్ని చిత్రాల్లో తళుక్కున మెరిసే పాత్రలను చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సై ,మగధీర, బాహుబలి చిత్రాల్లో ఆయన అలా మెరిసిన సంగతి తెలిసినదే. అంతేకాకుండా ఇతర దర్శకుల చిత్రాల్లో కూడా రాజమౌళి నటించాడు. నాని హీరోగా నటించిన మజ్ను మూవీలో కనిపించారు. అలాగే రైన్ బో అనే సినిమాలో నటించారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.