ఈ విష‌యాల్లో జ‌గ‌న్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఔను.. తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వ‌భావాన్ని వ‌దిలించుకోవాల‌నేది.. వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న కొన్ని విధానాల కార‌ణంగా.,. స‌మాజంలో త‌లె త్తుకోలేక పోతున్నామ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాల‌నేది .. నాయ‌కుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవ‌రూ కూడా బ‌య‌ట ప‌డ‌డంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో ప‌డేలా చేస్తున్నారు.

“ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని లేద‌నే మాట వినిపిస్తోంది. దీనివ‌ల్ల‌.. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి కూడా ఇదే ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌స్తుంది. అప్పుడు మేం ఏం చెప్పాలి. ప్ర‌త్య‌ర్థులు ఈ విష‌యాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై స‌మాధానం చెప్పుకోలేక పోతున్నారు. ఎవ‌రు ప‌డితే వాళ్లు.. ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో త‌లెత్తుకునే ప‌రిస్థితి లేకుండా పోతోంది!“ అని తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు.

ఇక‌. సీమ కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఏదో ఒక‌టి తేల్చేయాలేది వారు సూచ‌న‌గా ఉంద‌ట‌. “క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని అన్నారు. పోనీ.. దాని కోసం అయినా.. చ‌ర్య‌లు తీసుకుంటే.. మేం రోడ్ల మీద‌కు వ‌స్తాం. లేక‌పోతే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఏం జ‌రిగింది? అని ప్ర‌శ్నిస్తే.. ఏమీ చెప్ప‌లేక పోతున్నాం. ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ త‌న పంథాను మార్చుకుని.. ఏదో ఒక‌టి తేల్చేయాలి. పోనీ.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. ఎన్నిక‌ల‌కైనా వెళ్లాలి“ అని ఆయ‌న చెబుతున్నారు.

ఈ ప‌రిస్థితి దాదాపు అన్ని జిల్లాల్లోనూ క‌నిపిస్తోంది. “ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం. కానీ, అవేవీ కూడా.. పార్టీకి మైలు రాళ్లుగా నిలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రాజ‌ధాని విష‌యాన్ని తేల్చేస్తే.. ఊపిరి పీల్చుకుంటాం. ముసుగులో గుద్దులాట ఎందుకు.. కేంద్రం ద‌గ్గ‌ర రెండు రోజులు కూర్చుంటే.. ఏదో ఒక‌టి తేల్చేస్తారుక‌దా!“ అని ఒక నేత వ్యాఖ్యానించారు. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ అనుస‌రిస్తున్న మూడు రాజ‌ధానుల విష‌యంపై.. ప్ర‌జ‌ల్లో నెల‌కొన్ని గంద‌ర‌గోళం త‌మ‌కు శాపంగా మార ప‌రిస్థితి ఉంద‌ని.. వైసీపీ నాయ‌కులు హ‌డ‌లి పోతున్నార‌నేదివాస్త‌వం.