టీడీపీలో ఏం జ‌రుగుతోంది… చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోందెవ‌రు…!

ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి ఇప్పుడు స‌రైన స‌మ‌యం. అదే స‌మ‌యంలో క‌ఠినమైన ప‌రీక్షా కాలం కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసుకుంటున్న స‌మ‌యంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు కూడా చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ర ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు.

 

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్ర‌బాబు మూడు రోజుల ప‌ర్య‌ట‌న అనేక వివాదాల‌కు.. కేరాఫ్‌గా మారింది. అధికార పార్టీ నేత‌ల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌.. సొంత పార్టీ నేత‌లు దూరంగా ఉండ‌డం.. మాజీ మంత్రులు సైతం కొంద‌రు ఈ ప‌ర్య‌ట‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటివి చూస్తే.. టీడీపీకి అస‌లు సిస‌లు ప‌రీక్షా కాలం ఇదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు అధికార పార్టీ వేస్తున్న వ్యూహాలు.. కార్య‌క‌ర్త‌ల్లో స‌మైక్య‌తా లేమి.. దాడులు.. పోలీసుల కేసులు.. ఇలా అనేక రూపాల్లో స‌వాళ్లు వ‌స్తున్నాయి.

వీటిని అధిగ‌మించ‌డం చంద్ర‌బాబుకు ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన స‌వాలుగా మారింది. అదేస‌మ‌యం లో నాయ‌కుల‌ను లైన్‌లో పెట్ట‌డం.. వారిని ముందుండి న‌డిపించ‌డం.. వంటివి కూడా అంత ఈజీఏమీ కాదు. ఉదాహ‌ర‌ణ‌కు తాజాగా జ‌రిగిన కుప్పం ప‌ర్య‌ట‌న‌లో అనేక మంది సీనియ‌ర్లు .. అస‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేదు. దీనిపై అనేక ఊహాగానాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొంద‌రు అధికార పార్టీ చెప్పు చేత‌ల్లోకి వెళ్లిపోయార‌ని.. కుప్పంలోనే ఒక టాక్ న‌డుస్తోంది.

అదే స‌మ‌యంలో కొంద‌రు బెదిరింపుల‌కు లొంగిపోయార‌ని అంటున్నారు. దీంతో కుప్పంలో ప్ర‌ధాన‌మైన నాయ‌కులు లేకుండానే.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ముగిసిపోయింది. మ‌రోవైపు.. అధికార పార్టీ దూకుడు మ‌రింత పెరిగింది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు పార్టీని ముందుకు న‌డిపించ‌డం అంటే.. తాను న‌డిస్తేనే కాదు.. పార్టీ నేత‌ల‌ను కూడా అంతే ధీమాతో ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ విష‌యంలో ఎక్క‌డ తేడా వ‌చ్చినా.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.