అరడజను ఎంపీల నెల్లూరు..ఒరిగింది లేదు..!

ఎంపీల వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండటం లేదని మరొకసారి స్పష్టమవుతుంది. గతంలో మెజారిటీ ఎంపీలు టీడీపీకి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు. కాకపోతే అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక 2019 తర్వాత వైసీపీకి ప్రజలు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. అయినా సరే ఎంపీల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు ఎంపీలు అనే సంగతి..సొంత పార్లమెంట్ ప్రజలకే తెలియకపోవడం. అంటే అలా ఉంది ఎంపీల పరిస్తితి.

మిగతా ఎంపీల సంగతి పక్కన పెడితే..నెల్లూరు ఎంపీల పరిస్తితి ఇంకా వేరుగా ఉంది. వాస్తవానికి నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీలు ఆరుగురు ఉన్నారు. అదేంటి ఆరుగురు ఎక్కడ నుంచి వచ్చారు అనుకోవచ్చు. వరుసపెట్టి లెక్క పెట్టుకుంటే…మెయిన్ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి..ఈయన పార్లమెంట్‌లో ఇతర అంశాల గురించి ప్రశ్నలు అడగడం తప్ప..నెల్లూరుకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నలు అడగడం ఉండదు అని..అక్కడి ప్రజలే మాట్లాడుకునే పరిస్తితి.

ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తి..తిరుపతి పరిధిలో నెల్లూరు జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా ఎంపీ అయిన గురుమూర్తి మరి లోక్‌సభలో మాట్లాడిన సందర్భం కనిపించడం లేదు. అటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి..ఈయన సొంత జిల్లా నెల్లూరు. అయినా సరే మాగుంట కూడా జిల్లా కోసం గళం విప్పిన సందర్భం లేదు.

ఇటు రాజ్యసభ సభ్యులు విషయానికొస్తే నెల్లూరుకు చెంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు ఉన్నారు. మరి నెల్లూరు కోసం ఏం చేస్తున్నారంటే..ఆ విషయం నెల్లూరు ప్రజలనే అడిగితే బెటర్ అని చెప్పొచ్చు. విజయసాయి విశాఖలోనే ఉంటారనే సంగతి తెలిసిందే. అసలు వేమిరెడ్డి పెద్ద మనిషిగా ఉన్నారు గాని..ఆయన నెల్లూరు కోసం రాజ్యసభలో గళం విప్పిన సందర్భం లేదని అంటున్నారు. ఇక కొత్తగా వచ్చిన బీదా గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు. మొత్తానికి అరడజను ఎంపీలు ఉన్నా సరే నెల్లూరుకు ఒరిగింది ఏమి లేదు.