పవన్ కల్యాణ్ తో ఆ హీరోకి పోలికా? హైపర్ ఆదిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం!

జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పంచ్ డైలాగులతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో జబర్థస్త్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టి తాను మొదటి వరుసలోకి వచ్చాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ETVలో ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేయడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సోలో హీరోగా కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

ఈ విషయాన్ని ఆది ఎన్నో సందర్భాలలో స్వయంగా తననోటితో తానే వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చాలు ఆది రెచ్చిపోతుంటాడు. ఇకపోతే బేసిగ్గా సినిమాలను ప్రమోట్ చేయడానికి టెలివిజన్లో ప్రసారం అవుతున్న టీవీ షోస్ లో సినిమా యూనిట్ సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమవుతున్న “శ్రీదేవి డ్రామా కంపెనీ” జబర్దస్త్ ద్వారా కూడా తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల “నేను మీకు బాగా కావాల్సినవాడిని” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం అండ్ టీమ్ ఢీ షో లో సందడి చేసింది.

ఈ షోలో కిరణ్ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ.. “బేసిక్ గా నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. కళ్యాణ్ గారి మాట విన్నా, ఆయన పాట విన్నా నోటికి తెలియకుండా అరుపులు, చేతికి తెలియకుండా చప్పట్లు, వేళ్లకు తెలియకుండా విజిల్స్ వస్తాయి. నాకు తెలిసి మళ్లీ పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉంటే అది కిరణ్ అబ్బవరం” అని ఆది చెప్పుకొచ్చాడు. దీంతో కిరణ్ ఆది కి కృతజ్ఞతలు చెప్పాడు కానీ, కిరణ్ అబ్బవరం ని పొగుడుతూ పవన్ కళ్యాణ్ తో పోల్చి అంతటి గొప్ప హీరో అవుతావని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆది మీద మండిపడుతున్నారు.