ఎన్టీఆర్ టూ వైఎస్సార్..ఒరిగేది ఏంటి?

ఏదేమైనా సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వానికి  సాటి లేదనే పరిస్తితి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇక ఆ నిర్ణయాలు ఒకోసారి బాగానే ఉంటాయి..ఒకోసారి మాత్రం వివాదాస్పదం అవుతాయి. ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయం లాంటిది. ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ చాలానే తీసుకున్నారు. తాజాగా కూడా జగన్ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని..వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. రాత్రికి రాత్రే జీవో తీసుకొచ్చి..దీనికి కేబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. అలాగే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకోనున్నారు. అయితే దీనిపై టీడీపీ అటు అసెంబ్లీలోనూ..ఇటు బయట ఆందోళనలు చేస్తుంది. ఎన్టీఆర్ పేరు మార్చడానికి వీలు లేదని, వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ పేరు మార్పు అనేది లాంఛనమే.

అయితే పేరు మార్చడం వల్ల వైసీపీకి ఒరిగేది ఏమైనా ఉందా? అంటే ఏమి లేదనే చెప్పొచ్చు..పైగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం పెంచడం తప్ప. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుని వైసీపీ వాడుతుంది. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఆయన దగ్గర నుంచి పార్టీ లాకున్నారని, కాబట్టి ఎన్టీఆర్ పేరుని వాడే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు ఫైర్ అవుతూ ఉంటారు.

ఇదే క్రమంలో కృష్ణా జిల్లాని విభజించి విజయవాడ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. అదిగో తమకే ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందని, టీడీపీకి లేదని విమర్శించారు. అలాగే కొందరు వైసీపీ నేతలు ఎన్టీఆర్ ఫోటోని ఫ్లెక్సీల్లో వేసుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ విగ్రహాలని కూల్చివేయడం, పథకాలకు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పెట్టడంపై వైసీపీ నేతలు స్పందించ లేదు. తాజాగా ఎన్టీఆర్ వర్శిటీకి వైఎస్సార్ వర్శిటీ అని పేరు పెట్టారు.

అసలు విజయవాడలో హెల్త్ వర్శిటీని తీసుకొచ్చింది ఎన్టీఆర్..1983లోనే తీసుకొచ్చారు. 1986లో వర్శిటీ ప్రారంభమైంది. మొదట దీనికి యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అనే ఉండేది. తర్వాత ఎన్టీఆర్ చనిపోయారు..దీంతో 1998లో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు..యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇక ఇందులో వైఎస్సార్ జోక్యం ఏమి లేదు. కానీ ఇప్పుడు దీనికి ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెడుతున్నారు. మరి ఇలా పెట్టడంలో వల్ల వైసీపీకే రాజకీయంగా ఇబ్బందయ్యేలా ఉంది. మొత్తానికైతే పేరు మార్చడం వల్ల వైసీపీకి ఒరిగేది ఏమి లేదు.

Share post:

Latest